Slide # 1

Slide # 1

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 2

Slide # 2

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 3

Slide # 3

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 4

Slide # 4

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 5

Slide # 5

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Tuesday, 27 June 2017

చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’ 

నటీనటుల: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - రావు రమేష్ - మురళీ శర్మ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - తనికెళ్ల భరణి - చంద్రమోహన్ - వెన్నెల కిషోర్ - శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి - దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్

హీరో అల్లు అర్జున్.. దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో  తెరకెక్కిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ: 

చిన్నతనం నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే (అల్లు అర్జున్). ఓవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూనే.. మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. తన ఐడెంటిటీ తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు (రావు రమేష్).. డీజే మీద దృష్టిసారిస్తాడు. తన డొంక కదిలిస్తున్న డీజే గుట్టు మొత్తం తెలుసుకుని అతడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు రొయ్యల నాయుడు. మరి డీజే.. అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ ఎలా కొనసాగించాడు.. ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని ఎలా ఆదుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

హీరో అరంగేట్రాన్ని చిన్నతనం నుంచి చూపిస్తూ అక్కడి నుంచే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం తెలుగు సినిమాల్లో మామూలే. ‘దువ్వాడ జగన్నాథం’లో కూడా హరీష్ శంకర్ కథను అలాగే మొదలుపెట్టాడు. కాలేజీలో తన అక్కయ్యను అల్లరి పెడుతున్న కుర్రాళ్ల మీదికి పది పన్నెండేళ్ల వయసున్న చిన్న పిల్లాడు దూసుకెళ్తాడు. వాళ్లను ఉతికారేసేస్తాడు. పిల్లాడేంటి.. అంత పెద్దోళ్లను కొట్టేయడమేంటి అనిపించినా.. కమర్షియల్ సినిమాల్లో ఈమాత్రం హీరోయిజం అర్థం చేసుకోదగ్గదే అని సర్దుకుపోవచ్చు. కానీ ఆ పిల్లాడు అంతటితో ఆగడు. మార్కెట్లో ఓ పోలీసోడిని రౌడీ గ్యాంగ్ చంపేయబోతుంటే.. తనే గన్ను తీసుకుని ఆ బ్యాచ్ మొత్తాన్ని టపాటపా కాల్చి అవతల పారేస్తాడు. అంతటితో ఆగినా బావుణ్ను. ఆ తర్వాత పోలీస్ స్టేషనుకెళ్తే అక్కడ ఓ రౌడీని చూసి ఊగిపోయి మళ్లీ గన్ను తీసి ఠపీమని కాల్చేస్తాడు.

పోలీసోడికి పిల్లాడిలో ఉన్న ఫైర్ నచ్చేస్తుంది. అతడితో చెయ్యి కలిపేస్తాడు. తన దగ్గరికి వచ్చే కంప్లైంట్లన్నింటినీ ఈ పిల్లాడికి ఫార్వర్డ్ చేస్తాడు. అతనెళ్లి రౌడీలు.. గూండాల భరతం పట్టేస్తూ ఉంటాడు. అవతలున్నది ఎంతటి బిగ్ షాట్ అయినా సరే.. దువ్వాడ జగన్నాథం దగ్గరికి కంప్లైంట్ వచ్చిందంటే అతను డీజే అవతారంలోకి వచ్చేసి మ్యాటర్ ముగించేస్తాడంతే. ఇక్కడ పరిచయ సన్నివేశంలో హీరోను కనీసం నూనూగు మీసాల కుర్రాడిగా అయినా చూపిస్తే కాస్తయినా వాస్తవికంగా అనిపించునేమో. కానీ ఓ చిన్న పిల్లాడు అలా హత్యలు చేయడం.. అతడితో పోలీస్ మిషన్ మొదలుపెట్టడమే విడ్డూరంగా అనిపిస్తుంది. అప్పుడే అనిపిస్తుంది.. ఇలాంటి సన్నివేశాలతో సభ్య సమాజానికి దర్శకుడు హరీష్ శంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడా అని. తొలి సన్నివేశంతోనే దారి తప్పిపోయిన ‘డీజే’. తర్వాత కూడా ఎక్కడా సరైన దారిలో సాగుతున్నట్లుగా అనిపించడు. కమర్షియల్ సినిమాలంటే ఏం చేసినా చెల్లిపోతుంది అనే ‘పాత’ ఆలోచనతో హరీష్ శంకర్ తీసిన రొటీన్ సినిమా ‘డీజే’.

రొటీన్ అనిపించినా ఎంటర్టైన్మెంట్ తో మ్యాజిక్ చేసి  పైసా వసూల్ అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘డీజే’ ట్రైలర్ పోస్టర్ చూస్తే.. ఇది ఆ కోవలోని సినిమాలాగే అనిపించింది. అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడి పాత్ర భలేగా ఎంటర్టైన్ చేసేస్తుందని.. ఆ మాయలో కథ ఎంత రొటీన్ గా ఉన్నా చెల్లిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ‘అదుర్స్’ సినిమాను చారి పాత్ర నిలబెట్టినట్లుగా.. ‘డీజే’కు బ్రాహ్మణ కుర్రాడి పాత్ర బలం కాలేకపోయింది. ప్రోమోల్లో మెరిసినట్లుగా సినిమాలో మెరవలేకపోయింది ఈ పాత్ర. ఆరంభ మెరుపులు తప్పితే.. ఈ పాత్రలో విషయం లేదు. రెండు మూడు సన్నివేశాలకే ఈ క్యారెక్టర్ తేలిపోతుంది. ఇందులో ఏ ప్రత్యేకతా లేదనిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పెద్దగా వినోదాన్ని పంచకపోవడంతో కాసేపటికే ‘డీజే’ బోర్ కొట్టించడం మొదలుపెడతాడు.

ఏ కొత్తదనం లేని ఈ కథనంలో రొమాన్స్ కూడా ఆసక్తి రేకెత్తించదు. పొగరుబోతు హీరోయిన్... హీరోతో సయ్యాటలాడి అతడిని ముగ్గులోకి దించడం.. తర్వాత అతణ్ని అవమానించి వెళ్లిపోవడం.. తర్వాత హీరో మీద ఆమెకు కలవరం పుట్టడం.. ఇలా 90ల నాటి రొమాంటిక్ ట్రాక్స్ ను గుర్తుకు తెస్తుంది ‘డీజే’లో లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టే సరైన సీన్ కూడా చూపించకుండా.. హోం మంత్రి కూతురు వంటవాడైన హీరో కోసం వెతుక్కుంటూ వచ్చేయడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ను సైతం దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. హీరో హీరోయిన్ల పాత్రలు తేలిపోయాక ఇక రొయ్యల నాయుడిగా రావు రమేష్ క్యారెక్టర్ మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఆ పాత్రదీ ఆరంభ శూరత్వమే అయింది. ఎంటర్టైన్మెంట్ మీద ఆశలు పోవడంతో ఇక యాక్షన్ మీద.. కథ మీద ఫోకస్ పెడతాం. అవి మరింతగా నిరాశకు గురి చేస్తాయి. అక్కడక్కడా కొన్ని కామెడీ మెరుపులు.. పూజా హెగ్డే గ్లామర్.. పాటలతో ప్రథమార్ధమైనా ఓ మాదిరిగా అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధమైతే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

అగ్రి గోల్డ్ కుంభకోణం నేపథ్యంలో కథను అల్లుకోవడం కంటెంపరరీగా అనిపించొచ్చు కానీ.. ఆ పాయింట్ మినహాయిస్తే ఇంకేదీ ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అనిపించదు. రావు రమేష్ ది ముందు సహాయ పాత్రలా అనుకుంటాం కానీ.. అతడిదే లీడ్ విలన్ రోల్ అని తెలియడానికి చాలా సమయం పట్టేస్తుంది. హీరో-విలన్ డైరెక్ట్ వార్ మొదలయ్యే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా సినిమా అయిపోలేదా అన్న ఫీలింగ్ కలుగుతన్న సమయంలో అబుదాబి నేపథ్యంలో సా...గే ప్రి క్లైమాక్స్ ‘డీజే’ వాయింపుడుకు పరాకాష్ట. అందులో ఓ సన్నివేశంలో సుబ్బరాజు క్యారెక్టర్.. నువ్వు నన్ను పిచ్చోడిని చేద్దామనుకుంటున్నావా అంటూ ఆవేశపడతాడు. ఈ ఎపిసోడ్.. ఆ తర్వాత వచ్చే ‘సర్ప్రైజింగ్’ క్లైమాక్స్ చూశాక ప్రేక్షకుల ఫీలింగ్ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. హరీష్ అన్నట్లుగా నిజంగా ఇలాంటి క్లైమాక్సును ప్రేక్షకులు ఊహించి ఉండరు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉండటం కూడా ‘డీజే’కు పెద్ద మైనస్. సినిమా అంతా అయ్యాక కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అల్లు అర్జున్.. దిల్ రాజు ఈ కథకు ఎలా ఓటేశారన్న సందేహం కలుగుతుంది. ఐతే బన్నీ ‘బద్రీనాథ్’ చేసిన సంగతి.. ఇదే హరీష్ శంకర్ తో దిల్ రాజు ‘రామయ్యా వస్తావయ్యా’ తీసిన విషయం గుర్తుతెచ్చుకుంటాం!

నటీనటులు: 

అల్లు అర్జున్ నటన ఓకే అనిపిస్తుంది. బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో తనవంతుగా ఏదో చేశాడు కానీ.. ‘ముగ్గురు మొనగాళ్లు’లో చిరంజీవి.. అదుర్స్’లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పోలిస్తే ఇది సోసో. ఈ పాత్ర వాటిలా అంత ఎంటర్టైనింగ్ గా లేదు. బన్నీ లుక్ మాత్రం బాగుంది. రెండు అవతారాల్లోనూ ఆకట్టుకున్నాడు. అతడి డ్యాన్సులు.. ఫైట్ల గురించి చెప్పేదేముంది. ఎప్పట్లాగే బాగా చేశాడు. పూజా హెగ్డే సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఆమెలోని గ్లామర్ యాంగిల్ ను హరీష్ బాగా ఎలివేట్ చేశాడు. తెలుగులో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించింది పూజ. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం చూపించకుండా రెచ్చిపోయింది. అందంగా.. సెక్సీగా కనిపించిన పూజ నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. రావు రమేష్ కొన్ని సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించాడు కానీ.. లీడ్ విలన్ రోల్ కు ఆయన సరిపోలేదు. మురళీ శర్మ పాత్ర.. నటన మామూలే. ఈ మధ్య కామెడీలో మాంచి రైజింగ్ లో ఉన్న వెన్నెల కిషోర్ ను ఇందులో సరిగా వాడుకోలేదు. పోసాని.. భరణి.. చంద్రమోహన్.. వీళ్లంతా మామూలే. నటీనటులు చాలామంది ఉన్నా.. చాలామంది ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.

సాంకేతికవర్గం: 

దేవిశ్రీ ప్రసాద్ ఓ కమర్షియల్ సినిమాకు సరిపోయే ఊపున్న మ్యూజిక్ ఇచ్చాడు. అస్మైక యోగ తస్మైక భోగ.. వీనుల విందే కాదు.. కనువిందు కూడా. మిగతా పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఊపుతో సాగుతాయి. అయానంక బోస్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. దిల్ రాజు సినిమా.. పైగా ఆయన బేనర్లో 25వది.. కాబట్టి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటొచ్చీ కథాకథనాలే తేడా కొట్టేశాయి. తాను ప్రేక్షకుల అంచనాలకు అందనని హరీష్ శంకర్ మరోసారి రుజువు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కెరీర్ కు అత్యంత కీలకమైన పెద్ద అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడు. రొటీన్ కథను ఎంచుకోవడంతోనే నిరాశ పరిచిన హరీష్.. ఇక కథనం విషయంలోనూ ఏ ప్రత్యేకతను చూపించలేకపోయాడు. రైటర్ గా తన మీద పెట్టుకున్న ఆశల్ని అతను నీరుగార్చేశాడు. అక్కడక్కడా కొన్ని డైలాగులేవో పేలాయి కానీ.. ఓవరాల్ గా హరీష్ మార్కు వేగం.. ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్సయింది.

Wednesday, 11 January 2017

చిత్రం: ఖైదీ నెంబర్ 150  

నటీనటులు: చిరంజీవి - కాజల్ అగర్వాల్ -  ఆలీ -బ్రహ్మానందం - రఘుబాబు - జయప్రకాష్ రెడ్డి -నాజర్  - తరుణ్ అరోరా -రఘు కారుమంచి -పృథ్వీ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
రచన: పరుచూరి బ్రదర్స్ - సాయిమాధవ్ బుర్రా - వేమారెడ్డి
కథ: మురుగదాస్
నిర్మాత: రామ్ చరణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వి.వి.వినాయక్

 
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. తన రీఎంట్రీ మూవీ కోసం తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘కత్తి’ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు చిరు. ఈసారి కూడా మురుగదాస్ కథతోనే వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేసింది..? సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై చిరు ఎలా కనిపించాడు..? ఎలా పెర్ఫామ్ చేశాడు..? మొత్తంగా ‘ఖైదీ నెంబర్ 150’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చేలా ఉంది..? చూద్దాం పదండి.

కథ: 

చిన్నప్పట్నుంచి దొంగతనాలు చేయడం అలవాటైన కత్తి శీను (చిరంజీవి) కోల్ కతా జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని పట్టించేందుకు పోలీసులకు సాయపడ్డట్లే పడి.. వాళ్లను బోల్తా కొట్టించి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి శీను బ్యాంకాక్ వెళ్లబోతూ ఎయిర్ పోర్టులో లక్ష్మి (కాజల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రయత్నం మానుకుంటాడు. ఇంతలో కొన్ని కారణాల వల్ల శీను తనలాగే ఉండే శంకర్ అనే ఉద్యమకారుడి స్థానంలోకి వెళ్లాల్సి వస్తుంది. ముందు తాను తప్పించుకోవడానికి శంకర్ ను వాడుకునే ప్రయత్నం చేసినా.. ఆ తర్వాత శంకర్ గొప్పదనమేంటో శీనుకు తెలిసి అతడి కోసం పోరాటానికి సిద్ధపడతాడు. ఇంతకీ శంకర్ ఎవరు.. అతడు ఎవరి కోసం ఉద్యమిస్తున్నాడు.. ఆ ఉద్యమానికి శీను ఏ విధంగా తోడ్పడ్డాడు.. అతడి సమస్యను ఎలా పరిష్కరించాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

ముందుగా ‘ఖైదీ నెంబర్ 150’లో ఒక ముఖ్యమైన సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. ప్రి క్లైమాక్సులో కథ చాలా సీరియస్ గా సాగుతుంటుంది. రైతుల సమస్య సిటీలో జనాలకూ తెలియాలనే ఉద్దశంతో హీరో తెలివైన ఎత్తుగడ వేస్తాడు. ఆ ఎత్తుగడ ఆసక్తి రేకెత్తిస్తుంది. కథ మలుపు తిరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. అప్పుడో కమర్షియల్ బ్రేక్ వస్తుంది.

హీరోయిన్ హీరోకు ఫోన్ చేసి అతణ్ని అభినందిస్తుంది. ఇప్పుడీ అభినందనలు ఎందుకయ్యా అంటే.. పాట కోసం అన్నమాట. అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు అంటూ చిరు చెలరేగిపోతాడు. ఆ పాటలో చిరు డ్యాన్సులు అదిరిపోయాయి. మధ్యలో చరణ్ కూడా వచ్చి రచ్చ చేస్తాడు. అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఐతే అంత సీరియస్ వ్యవహారం సాగుతున్నపుడు మధ్యలో ఈ పాట అవసరమా అంటే మాత్రం ఏం చెప్పాలో తెలియదు. అభిమానుల్ని ఆ పాట అలరించే మాట వాస్తవం. కానీ కథాగమనానికి మాత్రం ఆ పాట పెద్ద అడ్డంకే. ఇలాంటి అడ్డంకులు.. డీవియేషన్లు ‘ఖైదీ నెంబర్ 150’లో అక్కడక్కడా ఉన్నాయి.

ఎంతో ఇంటెన్సిటీ ఉన్న సిన్సియర్ కథ ఉంది ‘ఖైదీ నెంబర్ 150’లో. కానీ ఆ కథను అంత ఇంటెన్సిటీతో.. అంత సిన్సియర్ గా మాత్రం చెప్పలేదు. ఐటెం సాంగ్ అని.. డ్యాన్సులని.. కామెడీ అని.. తమిళ మాతృకకు అద్దిన కమర్షియల్ హంగులు చిరంజీవి అభిమానుల్ని బాగానే మెప్పిస్తాయి. మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఐతే ఈ హంగులు దీని మాతృక అయిన ‘కత్తి’లో ఉన్న ఇంటెన్సిటీని మాత్రం తగ్గించేశాయి. దశాబ్దం తర్వాత తెరపై పూర్తి స్థాయిలో కనిపించిన చిరు తనదైన శైలిలో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తాడు ‘ఖైదీ నెంబర్ 150’లో. ఆయన నుంచి అభిమానులు ఆశించే ఆకర్షణలకు మాత్రం ‘150’లో లోటు లేదు.

చిరంజీవి నుంచి ప్రేక్షకులు ప్రధానంగా ఆశించేది ఎంటర్టైన్మెంట్. అందుకే చాలా వరకు సీరియస్ గా సాగే ‘కత్తి’ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చినట్లున్నాడు వినాయక్. ఈ విషయంలో అతను తప్పు చేశాడా అంటే ఏమో చెప్పలేం. ‘కత్తి’లో మాదిరే చిరు సినిమా అంతా సీరియస్ గా కనిపిస్తే ప్రేక్షకులకు రుచించేది కాదేమో. తమిళ వెర్షన్లో హీరోయిజానికి.. గూస్ బంప్స్ మూమెంట్స్ కు   ఢోకా ఉండదు కానీ.. ఏదైనా కూడా కథలోనే మిళితమై ఉంటుంది. ‘ఖైదీ నెంబర్ 150’లో మాత్రం డీవియేషన్ కనిపిస్తుంది. చిరు ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఇందులో కామెడీ.. ఐటెం సాంగ్.. క్లైమాక్స్ కు ముందు ఓ మాస్ సాంగ్.. ఇలాంటి హంగులు జోడించారు. దీంతో కథ అక్కడక్కడా పక్కదోవ పట్టినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో సినిమా బోరింగ్ గా అనిపించదు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు మినహాయిస్తే అంతా ఎంగేజింగ్ గానే సాగుతుంది.

రైతుల నుంచి భూముల్ని చౌకగా కొట్టేసి వాటితో వ్యాపారం చేసే ఓ కార్పొరేట్ సంస్థతో కథానాయకుడు చేసే పోరాటమే ‘ఖైదీ నెంబర్ 150’. సామాజికాంశాలతో ముడిపడ్డ కథను కమర్షియల్ కోణంలో చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. కంటెంపరరీగా అనిపించే ‘ఫార్మర్స్ వెర్సస్ కార్పొరేట్’ కాన్సెప్టుతో ప్రేక్షకులు ఈజీగా కనెక్టవుతారు. హృద్యంగా సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ఆయువు పట్టు. అక్కడ కథను బలంగా చెప్పారు. వర్తమానంలోకి వస్తే ప్రధానంగా హీరోయిజమే కనిపిస్తుంది. కథనం మామూలుగా అనిపిస్తుంది. విలన్ హీరో మీదికి అటాక్ చేయడం.. హీరో దీటుగా బదులివ్వడం.. ఇలా సాగుతుంది కథ. ఐతే మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే కాయిన్ ఫైట్ లాంటివి ఆకట్టుకుంటాయి. చిరు-కాజల్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఏమంత ఆసక్తికరంగా ఉండవు.

ప్రథమార్ధంలో ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఐతే ద్వితీయార్ధంలో కథ మంచి ఇంటెన్సిటీతో సాగుతుంది. హీరో-విలన్ పోరు కంటే కూడా.. హీరో సమస్య మీద పోరాడే తీరు ఆకట్టుకుంటుంది. ప్రి క్లైమాక్సులో వచ్చే ‘వాటర్’ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. చిరంజీవికి.. ఆయన పాత్రకు తగ్గట్లుగా విలన్.. ఆ పాత్ర కుదర్లేదు. సినిమాలో విలన్ పాత్ర పూర్తిగా తేలిపోయింది. ఆ పాత్రలో బలం లేకపోవడంతో హీరో-విలన్ మధ్య పోటీ అన్నదే కనిపించదు. ఇది సినిమాకు మైనస్ అయింది. ఓవరాల్ గా చూస్తే ‘ఖైదీ నెంబర్ 150’ మంచి కథ ఉంది కానీ.. దాన్ని అంత ప్రభావవంతంగా చెప్పలేదు. ఐతే చిరు మాత్రం తన అభిమానుల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తాడు. ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటారో అలా కనిపిస్తారు. మాస్ మసాలా అంశాలకు ఇందులో లోటు లేదు. లోటు పాట్లున్నప్పటికీ సినిమా ‘పైసా వసూల్’ అనిపిస్తుంది.

నటీనటులు: 

చిరంజీవి చివరగా కథానాయకుడిగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో కంటే కూడా ‘ఖైదీ నెంబర్ 150’లో అందంగా కనిపించారు అంటే అతిశయోక్తి కాదు. అంత బాగా తన లుక్ ను మార్చుకున్నాడు చిరు. ఆయన లుక్ చూసి.. ఎనర్జీ చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్టైలింగ్ పరంగానూ చిరు ఆకట్టుకున్నాడు. కత్తి శీను పాత్రకు తగ్గట్లుగా ఎనర్జిటిగ్గా నటించాడు చిరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డ్యాన్సులు అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. చిరు డ్యాన్సుల్లో మరీ స్పీడ్ లేదు కానీ.. రిథమ్.. గ్రేస్.. స్టయిల్ కు మాత్రం ఢోకా లేదు. కామెడీ సన్నివేశాల్లో చిరు ముద్ర కనిపిస్తుంది. 

. హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. ఆమె పాత్ర.. నటన అన్నీ కూడా మొక్కుబడిగా ఉన్నాయి. హెవీ మేకప్ కాజల్ లుక్ ను దెబ్బ తీసినట్లుగా అనిపిస్తుంది. ఆమె చాలా వరకు పాటలకే పనికొచ్చింది. కానీ పాటల్లో ఫోకస్ అంతా కూడా చిరు మీదే ఉండటంతో కాజల్ నామమాత్రంగా కనిపిస్తుంది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా తేలిపోయాడు. అతడి పాత్ర ఎఫెక్టివ్ గా లేదు. నటన కూడా అలాగే సాగింది. డబ్బింగ్ విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్టవ్వలేరు. బ్రహ్మానందం ఓ మోస్తరుగా నవ్వించాడు. ఆయన పాత్రలో కొత్తదనం లేదు. చిరు వెంటే ఉండే పాత్రలో ఆలీ పర్వాలేదు. రఘుబాబు.. జయప్రకాష్ రెడ్డి ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం: 

దేవిశ్రీ ప్రసాద్ చిరు ప్రధానంగా అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే మ్యూజిక్ ఇచ్చాడు. యు అండ్ మి పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ. నీరు నీరు పాటు హృద్యంగా అనిపిస్తుంది. సినిమాలో అది మంచి టైమింగ్ లో వస్తుంది. ఈ పాట థీమ్ ను బ్యాగ్రౌండ్ స్కోర్లో బాగా వాడుకున్నాడు దేవి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. మిగతా సినిమా అంతా జస్ట్ ఓకే అనిపిస్తుంది. రత్నవేలు గతంలో చేసిన సినిమాల్లో లాగా కెమెరా పనితనం అంత ప్రత్యేకంగా అనిపించదు కానీ.. సినిమాకు రిచ్ లుక్ మాత్రం తీసుకొచ్చింది. ఆద్యంతం కలర్ ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. చిరును రత్నవేలు చాలా బాగా చూపించాడు. పాటల చిత్రీకరణలోనూ రత్నవేలు ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 

సినిమాకు మాటలు పరుచూరి బ్రదర్స్.. సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి కలిసి అందించారు. రైతు సమస్యల నేపథ్యంలో వచ్చే మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. అభిమానుల కోసం రాసిన పంచ్ డైలాగులు ఏమంత బాగా లేవు. సినిమాలో ఆ డైలాగులు సింక్ అవలేదు. ఇలాంటి డైలాగులకు కాలం చెల్లిందని గుర్తించాలి. ఇక దర్శకుడు వి.వి.వినాయక్ విషయానికి వస్తే.. అతను చిరు కోరుకున్నట్లు సినిమా తీసి పెట్టాడు. ‘కత్తి’ సినిమాకు తనదైన కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మూల కథను మార్చలేదు కానీ.. కామెడీ.. కమర్షియల్ హంగులు అద్దాడు. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేశాడతను. అవి కొంత వరకు కథాగమనానికి అడ్డం పడ్డాయి. వినాయక్ ఇచ్చిన కమర్షియల్ టచ్ వల్ల మెగా అభిమానులకు.. మాస్ ప్రేక్షకులకు ‘ఖైదీ నెంబర్ 150’ చేరువ కావచ్చు. ఐతే కథను సిన్సియర్ గా చెప్పే విషయంలో మాతృక ‘ఖైదీ నెంబర్ 150’ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.