Slide # 1

Slide # 1

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 2

Slide # 2

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 3

Slide # 3

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 4

Slide # 4

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Slide # 5

Slide # 5

Far far away, behind the word mountains, far from the countries Vokalia and Consonantia, there live the blind texts Read More

Tuesday, 27 June 2017

చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’ 

నటీనటుల: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - రావు రమేష్ - మురళీ శర్మ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - తనికెళ్ల భరణి - చంద్రమోహన్ - వెన్నెల కిషోర్ - శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి - దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్

హీరో అల్లు అర్జున్.. దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబినేషన్లో  తెరకెక్కిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. మొదలైన నాటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ: 

చిన్నతనం నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే (అల్లు అర్జున్). ఓవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూనే.. మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. తన ఐడెంటిటీ తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్న రొయ్యల నాయుడు (రావు రమేష్).. డీజే మీద దృష్టిసారిస్తాడు. తన డొంక కదిలిస్తున్న డీజే గుట్టు మొత్తం తెలుసుకుని అతడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు రొయ్యల నాయుడు. మరి డీజే.. అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ ఎలా కొనసాగించాడు.. ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని ఎలా ఆదుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

హీరో అరంగేట్రాన్ని చిన్నతనం నుంచి చూపిస్తూ అక్కడి నుంచే హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం తెలుగు సినిమాల్లో మామూలే. ‘దువ్వాడ జగన్నాథం’లో కూడా హరీష్ శంకర్ కథను అలాగే మొదలుపెట్టాడు. కాలేజీలో తన అక్కయ్యను అల్లరి పెడుతున్న కుర్రాళ్ల మీదికి పది పన్నెండేళ్ల వయసున్న చిన్న పిల్లాడు దూసుకెళ్తాడు. వాళ్లను ఉతికారేసేస్తాడు. పిల్లాడేంటి.. అంత పెద్దోళ్లను కొట్టేయడమేంటి అనిపించినా.. కమర్షియల్ సినిమాల్లో ఈమాత్రం హీరోయిజం అర్థం చేసుకోదగ్గదే అని సర్దుకుపోవచ్చు. కానీ ఆ పిల్లాడు అంతటితో ఆగడు. మార్కెట్లో ఓ పోలీసోడిని రౌడీ గ్యాంగ్ చంపేయబోతుంటే.. తనే గన్ను తీసుకుని ఆ బ్యాచ్ మొత్తాన్ని టపాటపా కాల్చి అవతల పారేస్తాడు. అంతటితో ఆగినా బావుణ్ను. ఆ తర్వాత పోలీస్ స్టేషనుకెళ్తే అక్కడ ఓ రౌడీని చూసి ఊగిపోయి మళ్లీ గన్ను తీసి ఠపీమని కాల్చేస్తాడు.

పోలీసోడికి పిల్లాడిలో ఉన్న ఫైర్ నచ్చేస్తుంది. అతడితో చెయ్యి కలిపేస్తాడు. తన దగ్గరికి వచ్చే కంప్లైంట్లన్నింటినీ ఈ పిల్లాడికి ఫార్వర్డ్ చేస్తాడు. అతనెళ్లి రౌడీలు.. గూండాల భరతం పట్టేస్తూ ఉంటాడు. అవతలున్నది ఎంతటి బిగ్ షాట్ అయినా సరే.. దువ్వాడ జగన్నాథం దగ్గరికి కంప్లైంట్ వచ్చిందంటే అతను డీజే అవతారంలోకి వచ్చేసి మ్యాటర్ ముగించేస్తాడంతే. ఇక్కడ పరిచయ సన్నివేశంలో హీరోను కనీసం నూనూగు మీసాల కుర్రాడిగా అయినా చూపిస్తే కాస్తయినా వాస్తవికంగా అనిపించునేమో. కానీ ఓ చిన్న పిల్లాడు అలా హత్యలు చేయడం.. అతడితో పోలీస్ మిషన్ మొదలుపెట్టడమే విడ్డూరంగా అనిపిస్తుంది. అప్పుడే అనిపిస్తుంది.. ఇలాంటి సన్నివేశాలతో సభ్య సమాజానికి దర్శకుడు హరీష్ శంకర్ ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడా అని. తొలి సన్నివేశంతోనే దారి తప్పిపోయిన ‘డీజే’. తర్వాత కూడా ఎక్కడా సరైన దారిలో సాగుతున్నట్లుగా అనిపించడు. కమర్షియల్ సినిమాలంటే ఏం చేసినా చెల్లిపోతుంది అనే ‘పాత’ ఆలోచనతో హరీష్ శంకర్ తీసిన రొటీన్ సినిమా ‘డీజే’.

రొటీన్ అనిపించినా ఎంటర్టైన్మెంట్ తో మ్యాజిక్ చేసి  పైసా వసూల్ అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘డీజే’ ట్రైలర్ పోస్టర్ చూస్తే.. ఇది ఆ కోవలోని సినిమాలాగే అనిపించింది. అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడి పాత్ర భలేగా ఎంటర్టైన్ చేసేస్తుందని.. ఆ మాయలో కథ ఎంత రొటీన్ గా ఉన్నా చెల్లిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ‘అదుర్స్’ సినిమాను చారి పాత్ర నిలబెట్టినట్లుగా.. ‘డీజే’కు బ్రాహ్మణ కుర్రాడి పాత్ర బలం కాలేకపోయింది. ప్రోమోల్లో మెరిసినట్లుగా సినిమాలో మెరవలేకపోయింది ఈ పాత్ర. ఆరంభ మెరుపులు తప్పితే.. ఈ పాత్రలో విషయం లేదు. రెండు మూడు సన్నివేశాలకే ఈ క్యారెక్టర్ తేలిపోతుంది. ఇందులో ఏ ప్రత్యేకతా లేదనిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు పెద్దగా వినోదాన్ని పంచకపోవడంతో కాసేపటికే ‘డీజే’ బోర్ కొట్టించడం మొదలుపెడతాడు.

ఏ కొత్తదనం లేని ఈ కథనంలో రొమాన్స్ కూడా ఆసక్తి రేకెత్తించదు. పొగరుబోతు హీరోయిన్... హీరోతో సయ్యాటలాడి అతడిని ముగ్గులోకి దించడం.. తర్వాత అతణ్ని అవమానించి వెళ్లిపోవడం.. తర్వాత హీరో మీద ఆమెకు కలవరం పుట్టడం.. ఇలా 90ల నాటి రొమాంటిక్ ట్రాక్స్ ను గుర్తుకు తెస్తుంది ‘డీజే’లో లవ్ స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టే సరైన సీన్ కూడా చూపించకుండా.. హోం మంత్రి కూతురు వంటవాడైన హీరో కోసం వెతుక్కుంటూ వచ్చేయడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ను సైతం దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. హీరో హీరోయిన్ల పాత్రలు తేలిపోయాక ఇక రొయ్యల నాయుడిగా రావు రమేష్ క్యారెక్టర్ మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఆ పాత్రదీ ఆరంభ శూరత్వమే అయింది. ఎంటర్టైన్మెంట్ మీద ఆశలు పోవడంతో ఇక యాక్షన్ మీద.. కథ మీద ఫోకస్ పెడతాం. అవి మరింతగా నిరాశకు గురి చేస్తాయి. అక్కడక్కడా కొన్ని కామెడీ మెరుపులు.. పూజా హెగ్డే గ్లామర్.. పాటలతో ప్రథమార్ధమైనా ఓ మాదిరిగా అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధమైతే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

అగ్రి గోల్డ్ కుంభకోణం నేపథ్యంలో కథను అల్లుకోవడం కంటెంపరరీగా అనిపించొచ్చు కానీ.. ఆ పాయింట్ మినహాయిస్తే ఇంకేదీ ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అనిపించదు. రావు రమేష్ ది ముందు సహాయ పాత్రలా అనుకుంటాం కానీ.. అతడిదే లీడ్ విలన్ రోల్ అని తెలియడానికి చాలా సమయం పట్టేస్తుంది. హీరో-విలన్ డైరెక్ట్ వార్ మొదలయ్యే సమయానికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా సినిమా అయిపోలేదా అన్న ఫీలింగ్ కలుగుతన్న సమయంలో అబుదాబి నేపథ్యంలో సా...గే ప్రి క్లైమాక్స్ ‘డీజే’ వాయింపుడుకు పరాకాష్ట. అందులో ఓ సన్నివేశంలో సుబ్బరాజు క్యారెక్టర్.. నువ్వు నన్ను పిచ్చోడిని చేద్దామనుకుంటున్నావా అంటూ ఆవేశపడతాడు. ఈ ఎపిసోడ్.. ఆ తర్వాత వచ్చే ‘సర్ప్రైజింగ్’ క్లైమాక్స్ చూశాక ప్రేక్షకుల ఫీలింగ్ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. హరీష్ అన్నట్లుగా నిజంగా ఇలాంటి క్లైమాక్సును ప్రేక్షకులు ఊహించి ఉండరు. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉండటం కూడా ‘డీజే’కు పెద్ద మైనస్. సినిమా అంతా అయ్యాక కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అల్లు అర్జున్.. దిల్ రాజు ఈ కథకు ఎలా ఓటేశారన్న సందేహం కలుగుతుంది. ఐతే బన్నీ ‘బద్రీనాథ్’ చేసిన సంగతి.. ఇదే హరీష్ శంకర్ తో దిల్ రాజు ‘రామయ్యా వస్తావయ్యా’ తీసిన విషయం గుర్తుతెచ్చుకుంటాం!

నటీనటులు: 

అల్లు అర్జున్ నటన ఓకే అనిపిస్తుంది. బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో తనవంతుగా ఏదో చేశాడు కానీ.. ‘ముగ్గురు మొనగాళ్లు’లో చిరంజీవి.. అదుర్స్’లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో పోలిస్తే ఇది సోసో. ఈ పాత్ర వాటిలా అంత ఎంటర్టైనింగ్ గా లేదు. బన్నీ లుక్ మాత్రం బాగుంది. రెండు అవతారాల్లోనూ ఆకట్టుకున్నాడు. అతడి డ్యాన్సులు.. ఫైట్ల గురించి చెప్పేదేముంది. ఎప్పట్లాగే బాగా చేశాడు. పూజా హెగ్డే సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఆమెలోని గ్లామర్ యాంగిల్ ను హరీష్ బాగా ఎలివేట్ చేశాడు. తెలుగులో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా కనిపించింది పూజ. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం చూపించకుండా రెచ్చిపోయింది. అందంగా.. సెక్సీగా కనిపించిన పూజ నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. రావు రమేష్ కొన్ని సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించాడు కానీ.. లీడ్ విలన్ రోల్ కు ఆయన సరిపోలేదు. మురళీ శర్మ పాత్ర.. నటన మామూలే. ఈ మధ్య కామెడీలో మాంచి రైజింగ్ లో ఉన్న వెన్నెల కిషోర్ ను ఇందులో సరిగా వాడుకోలేదు. పోసాని.. భరణి.. చంద్రమోహన్.. వీళ్లంతా మామూలే. నటీనటులు చాలామంది ఉన్నా.. చాలామంది ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు.

సాంకేతికవర్గం: 

దేవిశ్రీ ప్రసాద్ ఓ కమర్షియల్ సినిమాకు సరిపోయే ఊపున్న మ్యూజిక్ ఇచ్చాడు. అస్మైక యోగ తస్మైక భోగ.. వీనుల విందే కాదు.. కనువిందు కూడా. మిగతా పాటలు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఊపుతో సాగుతాయి. అయానంక బోస్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. దిల్ రాజు సినిమా.. పైగా ఆయన బేనర్లో 25వది.. కాబట్టి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటొచ్చీ కథాకథనాలే తేడా కొట్టేశాయి. తాను ప్రేక్షకుల అంచనాలకు అందనని హరీష్ శంకర్ మరోసారి రుజువు చేశాడు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కెరీర్ కు అత్యంత కీలకమైన పెద్ద అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడు. రొటీన్ కథను ఎంచుకోవడంతోనే నిరాశ పరిచిన హరీష్.. ఇక కథనం విషయంలోనూ ఏ ప్రత్యేకతను చూపించలేకపోయాడు. రైటర్ గా తన మీద పెట్టుకున్న ఆశల్ని అతను నీరుగార్చేశాడు. అక్కడక్కడా కొన్ని డైలాగులేవో పేలాయి కానీ.. ఓవరాల్ గా హరీష్ మార్కు వేగం.. ఎంటర్టైన్మెంట్ ఇందులో మిస్సయింది.